గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమీక్ష జరిపారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేలా పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలని చైర్మన్‌ సూచించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు, కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల గురించి సవివరంగా తెలియజేశారు. ప్రతి అభ్యర్థికి సంబంధించి బయోమెట్రిక్‌ విధానం ద్వారా వేలిముద్రలను తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. ప్రతి 60 మంది అభ్యర్థులకు ఒక బయో మెట్రిక్‌ యూనిట్‌ను అందుబాటులో ఉంచేలా కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

బయోమెట్రిక్‌ విధానం అమలులో ఉన్నందున పరీక్ష ప్రారంభం అయ్యే నిర్ణీత సమయానికి కనీసం రెండు గంటల ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్ష గదిలోనూ తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రిలిమ్స్‌ నిర్వహణలో చీఫ్‌ సూపరింటెండెంట్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా, లేదా అన్నది ముందుగానే క్షేత్ర స్థాయిలో సరిచూసుకోవాలన్నారు.

ఉదయం10.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లను మూసి వేస్తారని, పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని తెలిపారు.అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌తోపాటు ఒక ఐడిని ఒరిజినల్‌( ఆధార్‌ /పాన్‌ కార్డు/ ఓటర్‌ ఐడి/ ఎంప్లాయ్‌ ఐ డి/ డ్రైవింగ్‌ లైసెన్స్‌/ పాస్‌ పోర్ట్‌ ) తీసుకురావాలని అన్నారు.హాల్‌ టికెట్‌ పై ఫోటో/ సంతకం లేనిపక్షంలో వారు గెజిటెడ్‌ అధికారిచే సక్రమంగా ధృవీకరించిన మూడు పాస్‌ పోర్ట్‌ ఫోటోలు తీసుకురావాలని మరియు నిర్ణీత ప్రొఫార్మాలో పరీక్ష కేంద్రంలో అప్పగించాలన్నారు.

అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించే ముందు పరీక్ష వేదిక ప్రవేశద్వారం వద్ద పరిశీలిస్తారని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు చెప్పుల మాత్రమే ధరించి రావాలని బూట్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కోసం బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను మాత్రమే అనుమతించబడుతుందని అన్నారు. ఫిజికల్‌ హ్యాండ్‌ క్యాప్‌ అభ్యర్థులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోనే వసతి కల్పించరని, అభ్యర్థులు హాల్‌ టికెట్‌ నెంబర్‌, ఓఎంఆర్‌ జవాబు పత్రంలో బుక్లెట్‌ సంఖ్య, వేదిక కోడ్‌ సరిగ్గా వేయాలన్నారు. సిరీస్‌ ఏ, బి, సి మరియు డి నుండి ఆరు అంకెల సంఖ్యకు మార్చబడిరదని అన్నారు.

ఓఎమ్‌ఆర్‌ జవాబు పత్రంపై వైటనర్‌ / చాక్‌ పవర్‌ / బ్లేడ్‌/ ఎరేజర్‌ ఉపయోగించరాదన్నారు. పరీక్ష పూర్తయ్యేవరకూ అభ్యర్థులెవరూ పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళకూడదని అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్‌ నారాయణరెడ్డి టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ దృష్టికి తెచ్చారు.

ఉదయం 10.30 నుండి మధ్యాన్నం ఒంటి గంట వరకు కొనసాగే ప్రిలిమ్స్‌ పరీక్షకు జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా నిజామాబాద్‌ నగరంలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించామన్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి ఎవరికైనా సందేహాలు, సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా 08462-220183 ఫోన్‌ నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని చైర్మన్‌కు వివరించారు.

తహసీల్దార్లను లైజనింగ్‌ ఆఫీసర్లుగా నియమించి, అన్ని కేంద్రాలను ఇప్పటికే పరిశీలన చేయించామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ డ్యూయల్‌ డెస్క్‌ లు, ఎలక్ట్రిసిటీ, ఫాన్స్‌, టాయిలెట్స్‌, తాగునీరు వంటి సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ప్రతి కేంద్రానికి ఒక ఏ.ఎన్‌.ఎం, ఒక ఆశా వర్కర్‌ ను నియమిస్తున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రాలు, ఇతర పరీక్షా సామాగ్రిని తగిన బందోబస్తు మధ్య పోలీస్‌ హెడ్‌ క్వార్ట్రర్‌ లో స్ట్రాంగ్‌ రూంలో భద్రపరుస్తామని పేర్కొన్నారు. తప్పనిసరిగా సి.సి కెమెరాల నిఘాలోనే ప్రశ్న పత్రాల బండిల్‌ సీల్‌ తీసేలా సి.ఎస్‌ లకు స్పష్టమైన సూచనలు చేశామన్నారు.

సంబంధిత శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించి అన్ని జాగ్రత్తలు సూచించామని వివరించారు. పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రతి కేంద్రం వద్ద మహిళా పోలీసు సిబ్బందిని కూడా నియమిస్తున్నామని, ఆర్టీసీ బస్టాండ్లు, పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సహాయపడేందుకు లైజన్‌ ఆఫీసర్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన పక్షంలో అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు చేరవేసేందుకు వీలుగా వాహనాలను కూడా అందుబాటులో ఉంచుతామని చైర్మన్‌ దృష్టికి తెచ్చారు.

వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, డీసీపీ అరవింద్‌ బాబు, నిజామాబాద్‌ ఆర్డీఓ రవి, డీఐఈఓ రఘురాజ్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »