రెంజల్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా వివాదాస్పదమైన చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు స్థల సమస్యను ఎట్టకేలకే బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ శుక్రవారం పరిష్కరించారు. ఆర్టీసీ అధికారులు, గ్రామస్తులకు గత నాలుగు నెలలుగా స్థల సమస్యతో అగాధం పెరిగిపోయింది. చివరికి ఆర్టీసీ అధికారులు గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు.
విషయాన్ని స్థానిక సర్పంచ్ మర్లషికారి రమేష్ కుమార్ నేతృత్వంలో ఆర్టీసీ సంస్థ చైర్మన్, నిజామాబాదు రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి ఆర్టీసీ అధికారుల వ్యవహార శైలిని వివరించారు.స్పందించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బోధన్ ఆర్డీవో, డిపో మేనేజరులను ఆదేశించి స్థలాన్ని సర్వే చేయించారు. ఎకరం ఏడు గుంటలు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఆధీనంలోకి రాగా మిగిలిన గుంట భూమి పంచాయతీ పరిధిలోకొచ్చింది.
బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ సమక్షంలో హద్దురాళ్ళను ఏర్పాటుచేసి ఒప్పంద కాగితాలను రాసుకున్నారు. భవిష్యత్తులో మరోసారి సమస్య తలెత్తకుండా ఇరువురి మధ్య ఒప్పందం చేశారు. గ్రామస్తులు పంచాయితీ తీర్మానం ద్వారా కలెక్టర్ అనుమతితో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీవో రాజేశ్వర్ తెలిపారు. అప్పటి వరకు గ్రామస్తులు సమన్వయం పాటించాలని ఆయన సూచించారు.
గ్రామస్తులపై ఆర్టీసీ అధికారులు పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరగా ఆర్డీవో స్పందించారు. ఆయన వెంట తహసిల్దార్ రాంచందర్, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్, బిజెపి మండల అధ్యక్షుడు సుక్క రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎల్.పి.పోచయ్య, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు రఫీక్, బిజెపి మాజీ అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్, గ్రామస్తులు బొగిడి పోచయ్య, కురుమే శ్రీనివాస్, ఇర్ల రాజు, నారాయణ, తదితరులు ఉన్నారు.