నిజామాబాద్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలకు పూర్తి నెలలు నిండకముందే పలు ఆసుపత్రుల్లో ముందస్తుగానే సిజీరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు నిర్వహిస్తున్న అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టిని కేంద్రీకరించింది. వాస్తవంగానే అత్యవసర పరిస్థితుల్లో ముందస్తుగా సిజీరియన్లు చేస్తున్నారా, లేక అవసరం లేకపోయినా ఇతరత్రా కారణాల వల్ల ఇలా వ్యవహరిస్తున్నారా అన్నది నిర్ధారించేందుకు కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులు, గైనకాలజిస్టులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఈ విషయాన్ని వెల్లడిరచారు. గర్భం ధరించిన 36 వారాల్లోపే సిజీరియన్లు చేయడం వల్ల తల్లీ, బిడ్డ ఆరోగ్యాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అత్యవసరం అయితే తప్ప ముందస్తు ప్రసవాలు చేయకూడదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరికైనా ముందస్తు సిజీరియన్ చేయాల్సిన అవసరం ఏర్పడితే, డీఎంహెచ్ఓ, జీజీహెచ్ సూపరింటెండెంట్, ప్రోగ్రాం ఆఫీసర్, ఇతర గైనకాలజీ వైద్యులతో నెలకొల్పిన కమిటీని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
వాస్తవ పరిస్థితిని ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన జరిపి అవసరమైతేనే సిజీరియన్కు అనుమతిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగా కమిటీని సంప్రదించకుండా ముందస్తుగానే సిజీరియన్ కాన్పులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిఫైడ్ గైనకాలజిస్టులతోనే ప్రసవాలు చేయించాలని, ఆన్-కాల్ విధానానికి స్వస్తి పలికి, పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.
ప్రసవాల కోసం చేరే గర్భిణీలకు సాధారణ కాన్పు చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసరం అయితే తప్ప సిజీరియన్ చేయకూడదన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి నార్మల్ డెలివరీ దోహదపడుతుందనే విషయాన్ని గర్భిణీలు, వారి కుటుంబీకులకు అర్ధమయ్యేలా అవగాహన కల్పిస్తూ సాధారణ కాన్పుపై భరోసా కల్పించాలని హితవు పలికారు.