కామారెడ్డి, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఏటా ఒకే రకం పంటను సాగు చేయడం వల్ల నేలలో పోషకాల స్థాయి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో(ఆత్మ) మహిళా కిసాన్ దివస్ పురస్కరించుకొని శనివారం గ్రామీణ ప్రాంతాల రైతులకు చిరుధాన్యాల సాగు, పోషణ విలువల ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
పంటల మార్పిడి విధానం వల్ల నేల సారవంతంగా మారుతుందని చెప్పారు. ఆహార ధాన్యాల కన్నా చిరుధాన్యాలలో పోషకాల స్థాయి అధికంగా ఉంటుందని తెలిపారు. నీటిపారుదల సరిగ్గా లేని మెట్ట ప్రాంతాల్లో రైతులు చిరుధాన్యాల పంటలను పండిరచుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం పొందే వీలుందని పేర్కొన్నారు. నిత్యం చిరుధాన్యాల ఆహార పదార్థాలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.
రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజకుమార్ మాట్లాడారు. చిరుధాన్యాలు వాటి ఉపయోగాల గురించి వివరించారు. మెట్ట ప్రాంతాలలో చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికెలు సాగు చేసుకోవచ్చని సూచించారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించిన ఉత్తమ మహిళా రైతులకు సన్మానం చేశారు.
కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏడీఏలు అపర్ణ, రత్న, సర్పంచ్ రత్నాబాయి, రైతుబంధు అధ్యక్షుడు విట్టల్ రావు, వ్యవసాయ అధికారులు పవన్ కుమార్, సునీత, జోత్స్న, ప్రియదర్శని, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, ఆత్మ అధికారులు పాల్గొన్నారు.