కామారెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం వాన కాలంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో 6.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడానికి గన్ని బ్యాగులు, తేమ శాతం పరిశీలించే యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర రూ.2060, సాధారణ రకానికి రూ.2040 నిర్ణయించిందని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తేమ వచ్చిన ధాన్యాన్ని ఏఈవోలు నిర్ధారణ చేసిన తరువాత కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లి విక్రయించాలని చెప్పారు.
సహకార సంఘాల ఆధ్వర్యంలో 55, ఐకెపి ఆధ్వర్యంలో 20 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారిని వసంత, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.