మాక్లూర్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని మాక్లుర్ మండలంలో గల చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
పెండిరగు పనులను నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్ పార్క్ ప్రారంభోత్సవం నాటికి కనీస సదుపాయాలైన నీటి వసతి, విద్యుత్ సరఫరా, టాయిలెట్లు వంటివి అందుబాటులోకి రావాలన్నారు. మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ నుండి అర్బన్ పార్కుకు కనెక్షన్ ఇవ్వాలని, విద్యుత్ సరఫరా కోసం వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా పిల్లలకు ఆటవిడుపు కోసం సుమారు 22 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్ ప్లే జోన్ ఏరియాలో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అన్నారు. అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు సమకూరుస్తామని, పనులు మాత్రం వేగవంతంగా జరిపించాలని సూచించారు. ఈ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని తహసీల్దార్ శంకర్ ను ఆదేశించారు. పార్కు ప్రధాన మార్గంతో పాటు మెయిన్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వారికి అర్బన్ పార్కు ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దాలని, అందమైన పూల మొక్కలు, ఆకట్టుకునే పెయింటింగ్స్ వేయించాలన్నారు.
ప్రవేశ ద్వారం నుండి నలువైపులకి వెళ్లే మార్గాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. అందమైన పూల మొక్కలతో పాటు అన్ని రకాల మొక్కలను పెంచాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల నాణ్యతలోనూ రాజీ పడకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉండే మొక్కలన్నీ అర్బన్ పార్క్‌లోను కనిపించాలన్నారు.
అర్బన్ పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అవసరమైన సదుపాయాలన్నీ నెలకొల్పాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఎఫ్‌డీఓ భవాని శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారిణి సౌమ్య, తాసిల్దార్ శంకర్,ఎంపీడీవో క్రాంతి, ఎంపీఓ శ్రీనివాస్ ఎలక్ట్రిక్ సిబ్బంది తదితర డిపార్ట్మెంట్ల మండల అధికారులు స్థానిక సర్పంచ్ లక్మి తదితరులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.