నిజామాబాద్, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుల కోసం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నందున, జిల్లాలోని మొత్తం 530 జీ.పీలు నామినేషన్ చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాతీయ స్థాయి అవార్డుల కోసం నిర్దేశించిన తొమ్మిది అంశాల్లోనూ ప్రతి గ్రామ పంచాయతీ సంబంధిత పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పొందుపర్చే సమాచారం ఖచ్చితత్వంతో కూడుకుని ఉండాలని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని జాగ్రత్తలు సూచించారు. ఇప్పటికే పోర్టల్‌లో నామినేషన్ నమోదు చేసుకున్న వారు అవసరమైన వివరాలను అప్‌లోడ్ చేయాలన్నారు.
ఒక్కో అంశం వారీగా క్రమపద్ధతిలో పొందుపర్చాల్సిన వివరాల గురించి అవగాహన కల్పిస్తూ, కీలక సూచనలు చేశారు. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని తెలియజేస్తూనే, స్థానికంగా ఆయా వనరుల ద్వారా జీ.పీలకు సమకూరే ఆదాయం వివరాలను, వాటిని వెచ్చిస్తూ చేపడుతున్న కార్యక్రమాలను అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, డీసీఓ సింహాచలం, డీఏఓ తిరుమల ప్రసాద్, వాజీద్ హుస్సేన్, డీఎంహెచ్‌ఓడాక్టర్ సుదర్శనం, డీడబ్ల్యుఓ సౌందర్య, డీఎస్‌ఓ చంద్రప్రకాశ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ యాదవ్, పంచాయతీరాజ్ ఈ.ఈ మురళి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఆయా మండలాలకు చెందిన సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.