కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డిలోని ఆర్కే జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు, గోండు జాతి నాయకుడు కొమురం భీం జయంతి నిర్వహించారు. భీం పోరాట పటిమను కొనియాడారు. అనంతరం ఉత్తమ విద్యార్థులను అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి షేక్ సలాం విచ్చేశారు.
వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను పూర్తిచేసేలా వారి లక్ష్యాలు చేరుకునేలా చదవాలని తెలిపారు. అకుంఠిత దీక్షతో చదువుతూ ఇతర విషయాల పట్ల లక్ష్య పెట్టకుండా జీవితం యొక్క అత్యున్నత గమ్యం వైపు వెళ్లాలని సూచించారు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు సైతం ఎప్పటికప్పుడు వివిధ అంశాలలో మరింతగా కృషిచేసి పోటీ తత్వంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.
అనంతరం ఆర్కే కళాశాలల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో ఆర్కే జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని సీనియర్ ఫ్యాకల్టీచే, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ ప్రతి విద్యార్థిని వారి లక్ష్యాలను చేరే విధంగా కృషి చేస్తున్నట్టు వివరించారు. అనంతరం ఉత్తమ విద్యార్థులకు మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో ఇంటర్ నోడల్‌అధికారి షేక్ సలాం, ఆర్కే జూనియర్ ప్రిన్సిపల్ శంకర్, డీన్ నవీన్, అధ్యాపకులు, ఇంటర్ ఆఫీసర్స్ రజాక్, విద్యార్థులు పాల్గొన్నారు.