కామారెడ్డి, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను గుర్తించి బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు.
గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలని సూచించారు. గ్రామీణ క్రీడ ప్రాంగణాలు అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతిరోజు 15 పరిశీలన చేయాలని సూచించారు.
అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. నేషనల్ పంచాయతీ అవార్డ్స్ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి డాటా సేవ్ చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.