నిజామాబాద్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు.
కమిటీ సభ్యులు పలు అంశాలను ప్రస్తావించగా, కలెక్టర్ వాటిపై సానుకూలంగా స్పందించారు. దివ్యంగుల కోసం ఉద్దేశించిన చట్టాలను తు.చ తప్పకుండా అమలు చేస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని భరోసా కల్పించారు. దళితబంధు పథకంలో ఎస్సీ వర్గానికి చెందిన ఐదు శాతం మంది దివ్యంగులకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామని, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులోనూ తప్పనిసరిగా 5 శాతం మంది దివ్యంగులకు కేటాయించేలా చూస్తామన్నారు.
వైకల్యంతో బాధుపడుతున్న వారికి అవసరమైన నిర్ధారణ పరీక్షలు జరిపించి ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాలో ప్రతీ నెల రెండు పర్యాయాలు ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల్లో బ్యాక్ లాగ్ ఖాళీలను గుర్తించి, వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని డీడబ్ల్యుఓ సౌందర్యను ఆదేశించారు.
కాగా, దివ్యంగులకు ఇదివరకు కేటాయించిన బ్యాటరీ ట్రై సైకిల్ లు చెడిపోయినందున, వాటి మరమ్మతుల కోసం సంబంధిత కంపెనీని సంప్రదించాలని, మరమ్మతులకు అవసరమైతే జిల్లా యంత్రాంగం తరపున నిధులు సమకూరుస్తామని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ దివ్యంగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.