నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గోడౌన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్లో పూర్తి స్థాయిలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.