సొంతింటి కల సాకారం చేసుకోండిలా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన ప్రభుత్వం అన్ని వసతులతో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్ల విక్రయానికి నవంబర్‌ 14 న బహిరంగ వేలంపాట నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో ముందస్తు అవగాహన కల్పించేందుకు వీలుగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రీ బిడ్డింగ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు, ఔత్సాహికులకు ధాత్రి టౌన్‌ షిప్‌ ప్రత్యేకతల గురించి కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.

నిజామాబాద్‌ నగరంలో ప్రభుత్వం తొలిసారిగా సకల సదుపాయాలతో మోడల్‌ టౌన్‌ షిప్‌ను నెలకొల్పుతోందని, సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఔత్సాహికులకు ఇది ఎంతో సదవకాశమని కలెక్టర్‌ పేర్కొన్నారు. మొత్తం 76 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో ప్రభుత్వం ధాత్రి టౌన్‌ షిప్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందులో తొలివిడతలో 32 ఎకరాల్లో వివిధ రకాల విస్తీర్ణాలతో కూడిన 316 నివేశన స్థలాలను వేలం ద్వారా విక్రయించడం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం మొదటి దశలో 80 ప్లాట్‌ ల విక్రయం కోసం నవంబర్‌ 14 , 15 తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఉదయం 9 గంటల నుండి బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒక చదరపు గజానికి కనీస ధర ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయమయ్యిందని, ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొని అధిక ధర పాడి తమకు నచ్చిన ప్లాట్‌ ను సొంతం చేసుకోవచ్చని సూచించారు.

బీ.టీ రోడ్లు, మిషన్‌ భగీరథ ద్వారా నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, డ్రైనేజీలు, ప్రహరీ ఇత్యాది అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వపరంగా టౌన్‌ షిప్‌ లో సమకూరుస్తున్నామని, ఇప్పటికే డీటీసీపీ ద్వారా లే అవుట్‌ అనుమతి కలిగి ఉందని తెలిపారు. 60 ఫీట్ల అప్రోచ్‌ రోడ్డు, 30, 40 ఫీట్ల అంతర్గత రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. టౌన్‌ షిప్‌ లో ప్లాట్‌ లు కొనుగోలు చేయదలచిన వారు ముందుగా ఈ.ఎం.డీ ధరావత్తు కింద కలెక్టర్‌, నిజామాబాద్‌ పేరిట 10 వేల రూపాయల డీ.డీ తీయాలని, వేలం ప్రారంభం కావడానికి ముందు డీ.డీ ని సంబంధిత అధికారికి అందజేసి వేలంలో పాల్గొనవచ్చని అన్నారు.

ఇదివరకు రాజీవ్‌ స్వగృహ పథకంలో దరఖాస్తు చేసుకుని 3000 రూపాలయ రుసుము చెల్లించిన వారు దాని రశీదును సమర్పించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలంలో ప్లాట్‌ దక్కించుకొని పక్షంలో ఈ.ఎం.డీ మొత్తాన్ని వాపస్‌ చేయడం జరుగుతుందన్నారు. ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్‌ కొనుగోలు చేసిన వారికి బ్యాంక్‌ ద్వారా రుణ సదుపాయం పొందే వెసులుబాటు ఉందన్నారు.

వేలంలో అధిక ధర పాడి ప్లాట్‌ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధిలో మూడు వాయిదాల్లో మొత్తం రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. పది శాతం వడ్డీ పై అదనంగా మరో 90 రోజుల వరకు రుసుము చెల్లించేందుకు గడువు పొందవచ్చని పేర్కొన్నారు. ఒకే విడతలో మొత్తం రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి ప్లాట్‌ ధరలో రెండు శాతం రుసుమును ప్రభుత్వం వెనక్కి ఇస్తుందన్నారు.

ప్రశాంతమైన వాతావరణం, అనుకూలమైన ప్రదేశంలో అన్ని హంగులతో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్‌ లను దక్కించుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. కాగా, ధాత్రి టౌన్‌ షిప్‌ కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయ భూములు కలిగి ఉన్న రైతులు స్థలాన్ని అందించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ ఖర్చుతోనే డబుల్‌ బీ.టీ రోడ్డు నిర్మాణంతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయిస్తామని, దీనివల్ల రైతుల భూములకు రెట్టింపు ధర పెరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, నిజామాబాద్‌ ఆర్దీఓ రవి, నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ అనిల్‌, టీఎస్‌ఐఐసి జిల్లా జనరల్‌ మేనేజర్‌ రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »