నిజామాబాద్, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. తమ విధులు, బాధ్యతలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకుని, నిర్దేశిత లక్ష్యాల సాధనకు నిబద్దతతో పని చేయాలని హితవు పలికారు.
శనివారం సాయంత్రం ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈ.సీలతో కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజువారీ సాధారణ విధులు నిర్వర్తిస్తూనే, హరితహారం, ఉపాధి హామీ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించడం, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్, మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాలు, హరితవనాలు, నర్సరీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఫీల్డ్ అసిస్టెంట్‌లను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా గల అన్ని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపులా ప్రతి మూడు మీటర్ల ఒకటి చొప్పున కనీసం ఆరు అడుగుల ఎత్తు కలిగిన మొక్క తప్పనిసరిగా ఉండాలని, మొక్కల నిర్వహణ, సంరక్షణ చర్యలను ప్రతి రోజు పర్యవేక్షించాలని, పచ్చదనం పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీల్లో ఎక్కడ కూడా ఖాళీ స్థలం మిగిలి ఉండకుండా ప్రణాళికాబద్ధంగా మొక్కలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఒక ఎకరం విస్తీర్ణంలో నాలుగు వేల చొప్పున మొక్కలు ఉండాలన్నారు. వీటి నిర్వహణ కోసం ప్రతి నాలుగు వందల మొక్కలకు ఒక వన సేవకుడిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలు, విద్యా సంస్థలు, విద్యుత్ సబ్ స్టేషన్లు, పీహెచ్ సీలు, ఇతర అవకాశం ఉన్న అన్ని ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు పెంచాలన్నారు. బృహత్, మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే తక్షణమే మొక్కలు నాటించాలన్నారు. వర్షాకాలం ముగిసినందున మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించేలా చర్యలు చేపట్టి, పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు.
పక్షం రోజుల అనంతరం తనతో పాటు జిల్లా అధికారులతో కూడిన బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుపుతాయని, ఎక్కడైనా మొక్కలు కనిపించకపోతే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంటును బాధ్యుడిగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సక్రమంగా పని చేయకపోతే ఏ వ్యవస్థ అయినా సరే కనుమరుగు అవుతుందని, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా సమర్ధవంతంగా, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఉద్బోధించారు.
జిల్లా వ్యాప్తంగా గల మొత్తం 530 జీ.పీ ల పరిధిలోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కావాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కనీసం అర ఎకరం స్థలాన్ని గుర్తిస్తూ, నవంబర్ 15 వ తేదీ లోగా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలని గడువు విధించారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే ఫార్మేషన్ రోడ్లు, కచ్చా డ్రైన్ లు వంటి ముఖ్యమైన పనులను ఇదివరకే గుర్తించడం జరిగిందని, ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున కూలీలను వినియోగిస్తూ డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తయ్యేలా ఫీల్డ్ అసిస్టెంట్లు చొరవ చూపాలన్నారు.
గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా లక్ష్యం నిర్దేశించుకుని పని చేయాలన్నారు. వచ్చే ఏడాది హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, డిసెంబర్ 15 నాటికి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 10 వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్డీఓ చందర్, ఏ.పీ.డీ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.