బోధన్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలం లంగ్డాపూర్ గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క జనాలపై దాడి చేస్తూ కనబడ్డవారిని కరిచేస్తూ తీవ్ర ఆందోళన కలిగించింది. పిచ్చికుక్క దాడిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వారి బందువులు హాజరు కాగా ఒక్క సారిగా పిచ్చి కుక్క దాడితో బంధువులంతా హతాశయులయ్యారు. ఇండ్లలో ఉన్న వారిపై సైతం కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, విచ్చలవిడిగా తిరుగుతూ జనాలను భయాందోళనకు గురి చేస్తూ తరుచు పిచ్చికుక్కలు దాడి చేసినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.
గ్రామ శివారు ప్రాంతంలో కోళ్ళు, మేకల వ్యర్థాలను విచ్చల విడిగా పార వేయడం వల్ల కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉందని చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అయినప్పటికి గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని గాయపడ్డ వారు, స్థానికులు కోరుతున్నారు.