నిజామాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్నిమరింతగా ఇనుమడిరపజేయాలని పిలుపునిచ్చారు.
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పి చైర్మన్ విట్ఠల్ రావు, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 18 మంది ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరు ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా, అందుకు గురువు అందించిన తోడ్పాటు, కృషియే కారణమని అన్నారు. అంకితభావం, నిబద్దతతో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తే వారికి తగిన గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించిన వారవుతారని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యాబుద్ధులు, వినయ విధేయతలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. అందుకే గురువులను దైవంతో సమానంగా భావిస్తారని అన్నారు. సామాన్య, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసి ఆదర్శప్రాయులుగా నిలవాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. అదే సమయంలో సామాజిక బాధ్యతలను సైతం గుర్తెరిగి తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమైనదని, పాఠశాలలో గడిపిన సమయం మధురస్మృతిగా నిలిచిపోతుందని అన్నారు. విద్యార్థులు తమ కెరీర్ లో ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరినా, పాఠశాల స్థాయిలో ఉత్తమ బోధన ద్వారా ఉజ్జ్వల భవిష్యత్తుకు పునాది వేసిన గురువులను జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే సమాజానికి చక్కటి దిశానిర్దేశం చేసే శక్తి ఉపాధ్యాయ వృత్తికే ఎక్కువగా ఉంటుందన్నారు.
ఈ వృత్తిలో అంకితభావంతో బాధ్యతలు నిర్వర్థించే వారికి లభించే సంతృప్తి కూడా ఇతర వృత్తుల వారికి లభించదని పేర్కొన్నారు. గురువులు తమ బోధనా పటిమతో అనేక అద్భుతాలను సృష్టించవచ్చని అన్నారు. ఇంతటి మహోన్నత బాధ్యతల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులు యాంత్రిక జీవనాన్ని దరి చేరనివ్వకుండా, అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తేవాలని సూచించారు.
వందల మంది విద్యార్థులు జీవితాలను తీర్చిదిద్దే గొప్ప అవకాశం కలిగిన బోధనా విధులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని హితవు పలికారు. ఫలితం అందించని ఏ వ్యవస్థ అయినా మునిగిపోయే నావతో సమానమని కలెక్టర్ ఉదహరించారు. ఇటీవలి కాలంలో ఒకింత మసకబారుతున్న ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంపొందించేందుకు ఉత్తమ బోధనతో చక్కటి ఫలితాలను రాబట్టేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చాలా మంది ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని, అయితే కొద్దిమంది వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం ఉపాధ్యాయ వర్గం అపవాదును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోందని అన్నారు. సమాజంలోని అనేక సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల్లోని ఎక్కువగా ఉంటాయని, వారికి సరైన బోధన అందిస్తే ప్రతి విద్యార్థి జీవితానికి బంగారు బాటలు వేసినవారవుతారని అన్నారు.
రానున్న రోజుల్లో జిల్లా విద్యా శాఖ ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.