కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వసతి గృహాలలో అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సంఖ్యను పెంచాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగిత రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని సమావేశ మందిరంలో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసాల్లో అర్హత గల వారిని గుర్తించి వసతి గృహాల్లో ప్రవేశాలు పొందే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఫ్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ల కోసం దరఖాస్తులు చేయించాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విధంగా చూడాలన్నారు. నవంబర్ 30లోగా 100 శాతం విద్యార్థులు స్కాలర్షిప్‌ల కోసం దరఖాస్తులు చేసుకునే విధంగా చూడాలన్నారు.
వసతి గృహాల్లో కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు యూనిఫాం, స్కూల్ షూస్, స్వెటర్లను ఇస్తున్నట్లు చెప్పారు. అంకితభావంతో పనిచేసిన వసతి గృహం సంక్షేమ అధికారులను గుర్తించి నగదు ప్రోత్సాకాలను ఇస్తామని తెలిపారు. వసతి గృహాల వారీగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, అధికారులు పాల్గొన్నారు.