నిజామాబాద్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ పంట గురించి, ఈ పంటకు మార్కెట్ లో గల డిమాండ్ గురించి తెలియజేశారు. ఈ అంశాలను రైతులకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ వారు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ప్రస్తుతం వరి కోతలు దాదాపుగా అన్ని చోట్లా పూర్తవుతున్నందున, సాంప్రదాయ సాగు నుండి అధిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను మళ్లించేందుకు ఇది ఎంతో మంచి తరుణం అని సూచించారు.
జిల్లాకు నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా వ్యవసాయ అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. దేశవ్యాప్తంగా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం ఐదు లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగు చేస్తున్నారని అన్నారు.
దీనివల్ల ఇతర దేశాల నుండి వంట నూనె నిల్వలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. స్థానికంగానే ఆయిల్ పామ్ పంటను నిర్ణీత విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు దేశానికి కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు.
ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలీనా 4200 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఇన్ పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను 90 శాతం సబ్సిడీతో మంజూరు చేస్తోందని, ఒక్కో ఆయిల్ పామ్ మొక్కకు రైతులు కేవలం 20 రూపాయలు చెల్లిస్తే, మొక్కకు అయ్యే మిగతా వ్యయాన్ని కూడా ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తుందని అన్నారు.
ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు లోను కావాల్సిన పని లేదన్నారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను సైతం ఆర్జించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని రైతులు అందిపుచ్చుకుని ఆయిల్ పామ్ సాగుతో ఆర్ధిక పరిపుష్టిని సాధించాలని హితవు పలికారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు కోసం ఆదర్శ రైతులు ముందుకు వస్తున్న నేపథ్యంలో, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో పూర్తి స్థాయిలో ఈ పంట సాగు జరిగేలా ప్రణాళికలు రూపొందించామని, లక్ష్య సాధనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు.
ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.