నిజామాబాద్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు రెండువేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే నవంబర్ పేదన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. అందరికీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.
పైగా ప్రభుత్వ విద్యాలయాలు కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం విద్యా రంగానికి అవసరమగు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయంగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.
మెస్ చార్జీలు1500 నుండి 3 వేలకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో మరో రెండు బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమం కోసం బీసీ బందు ప్రవేశపెట్టి ప్రతి బీసీలకు 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు నవాతే ప్రతాప్, జిల్లా నాయకులు ప్రసాద్, వెంకట్, గణేష్, బంటు శ్రీనివాస్, గణేష్, రాజు తదితరులు ప్రసంగించారు.