నిజామాబాద్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయించేలా ఆయా శాఖలకు చెందిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు, మన ఊరు – మన బడి పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆధునికీకరణ తదితర పనుల ప్రగతిని సమీక్షించారు. ఒక్కో హాస్టల్, పాఠశాల వారీగా పనులు ఏ దశలో కొనసాగుతున్నాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత వ్యవధిలోపు పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఆయా పనులకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని, అవసరమైన చోట అదనంగా నిధులు సమకూర్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండే సీజన్ అయినందున ప్రతి హాస్టల్ లోనూ కిటికీలకు తప్పనిసరిగా దోమతెరలు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులను పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పనులు చేపట్టే విషయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నం అయితే జిల్లా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. మంజూరీలు ఇచ్చిన అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో వారం రోజుల్లోగా పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ గడువు విధించారు.
నీటి వసతితో కూడిన టాయిలెట్లు, విద్యుద్దీకరణ, పైప్ లైన్ తో కూడిన సంప్, కిచెన్ షెడ్, టైల్స్, ఫ్లోరింగ్, పెయింట్ వంటి పనులన్నీ నాణ్యతా ప్రమాణాలకు లోబడి పక్కాగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అక్కడక్కడా చిన్న చిన్న పనులను అసంపూర్తిగా వదిలేస్తే, పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి చేపడుతున్న నిర్మాణాలు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. ఆశించిన ఫలితం సిద్ధించేలా, సదుపాయాలూ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రతి పనిని పూర్తి చేయించాలని, ఏ ఒక్క పని కూడా పెండిరగ్లో ఉండకూడదని హితవు పలికారు.
ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం చేపడుతున్న పనులను పూర్తిస్థాయిలో నాణ్యతతో జరిగేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద జిల్లాకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరై సిద్ధంగా ఉన్నందున, సంబంధిత పనులను వేగవంతంగా జరిపించాలన్నారు. పనుల ప్రగతిపై వచ్చే వారం తాను మళ్ళీ సమీక్ష నిర్వహిస్తానని, ఆలోపు పనులన్నీ పూర్తి కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఇంజనీరింగ్ విభాగం అధికారులు భావన్న, మురళి, దేవిదాస్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శన్, డీఎస్ సిడీఓ శశికళ, డీటీడబ్ల్యూవో నాగూరావు, డీపీవో జయసుధ, ఆయా శాఖల ఇంజనీరింగ్ విభాగం డీ.ఈ లు, ఏ.ఈలు పాల్గొన్నారు.