నిజామాబాద్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలు కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే సిజీరియన్ జరిగేందుకే ఎక్కువ ఆస్కారం ఉంటోందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామం గర్భిణీలు, శిశువుల ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపడమే కాకుండా సమాజానికి అనేక రకాలుగా నష్టం చేకూరుస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చారు.
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 54 శాతం సిజీరియన్లు అవుతుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏకంగా 89 శాతం సిజీరియన్లు అవుతున్నాయని అన్నారు. అనవసర సిజీరియన్ల వల్ల శరీరం కోతకు గురవుతూ, అధిక మోతాదులో రక్తం కోల్పోయి, ఇన్ఫెక్షన్ ల బారినపడుతూ గర్భిణీ మహిళలు అనారోగ్యాలకు గురికావాల్సి వస్తోందన్నారు. అన్నింటికి మించి మొదటి కాన్పు సిజీరియన్ అయితే, ఆ తరువాత అయ్యే ప్రసవాలన్నీ సిజీరియన్లే అవుతాయని, ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టం చేకూరుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
సిజీరియన్ వల్ల అప్పుడే పుట్టిన శిశువుకు అమృత తుల్యంగా భావించే ముర్రుపాలు పట్టే అవకాశం ఉండదని, దీనివల్ల శిశువులో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించే శక్తి సన్నగిల్లి, ఎదుగుదల లోపిస్తుందన్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను పక్కన పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని, దీనిని అనుకూలంగా మల్చుకుని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు అవసరం లేకపోయినా సిజీరియన్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారనే ఫిర్యాదులు తరుచూ తమ దృష్టికి వస్తున్నాయని అన్నారు.
పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైతే కనీస సదుపాయాలూ సైతం లేకుండానే, శాశ్వత ప్రాతిపదికన డాక్టర్లను ఏర్పాటు చేసుకోకుండా అప్పటికప్పుడు వైద్యులను రప్పిస్తూ ప్రసవాలు చేస్తున్నట్లు ఆసుపత్రుల పరిశీలన సందర్భంగా వెల్లడైందని కలెక్టర్ పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ పలు ఆసుపత్రులపై నిబంధనలు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సాధారణ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
సిజీరియన్ల వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన ప్రభుత్వం సాధ్యమైనంత వరకు వాటిని నిలువరించేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిష్ణాతులైన గైనకాలజిస్టు వైద్యులను నియమిస్తూ, అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటుతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నొప్పులు లేకుండా కాన్పులు చేసే విధానాన్నిఅందుబాటులోకి తెచ్చామని అన్నారు.
రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆసుపత్రిలో మాత్రమే ఈ విధానం అమలులో ఉండగా, ప్రస్తుతం నిజామాబాద్ జీజీహెచ్ లోనూ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా 80 మందికి విజయవంతంగా కాన్పులు చేశారని, నొప్పులు లేకుండా ప్రసవాలు జరగడంతో బాలింతలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైతేనే సిజీరియన్లు చేస్తారని, సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.
అన్ని వసతులతో కూడిన ఉచిత వైద్య సేవలతో పాటు, కేసీఆర్ కిట్ పథకం కింద ఆర్ధిక ప్రయోజనాన్ని చేకూరుస్తోందని గుర్తు చేశారు. గర్భిణీలు, వారి కుటుంబీకులు పై అంశాలను అర్ధం చేసుకుని సహజ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.