బీమ్గల్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చరిత్ర, విశిష్టతల గురించి, స్వయంభూగా వెలసిన స్వామి వారి మహిమల గురించి జిల్లా పాలనాధికారికి వివరించారు. కాగా, ఈ నెల 9 వ తేదీ వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
అంతకుముందు భీంగల్ పట్టణంలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.