భీమ్‌గల్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, ఇదే మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పనులు మందకొడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్, యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంప్, ఫ్లోరింగ్, ఫ్యాన్లు, పెయింట్, పైప్ లైన్, కిచెన్ షెడ్, టాయిలెట్స్ తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాలల ఆవరణలో మురుగు జలాలు, వర్షపు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
విద్యార్థులు ప్రయోజనాలతో ముడిపడిన పనులు అయినందున తమ సొంత ఇంటి పనులుగా భావిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదార్లకు హితవు పలికారు. అవకాశం ఉన్నచోట వంట గదికి ఆనుకుని డైనింగ్ హాల్ నిర్మించాలని, పాఠశాలలకు చెందిన ఖాళీ స్థలం వృధా కాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భీంగల్ ఉర్దూ మీడియం అప్పర్ ప్రైమరీ పాఠశాలలో అంగన్వాడీ చిన్నారుల కోసం వండిన భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పాఠశాలలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కంస్ట్రక్షన్ (ఎన్‌ఏసి) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్ లో, యువతులకు కుట్టు మిషన్ శిక్షణ అందిస్తుండగా, కలెక్టర్ ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఎంత మంది శిక్షణ పొందుతున్నారు, ఎన్ని రోజుల పాటు శిక్షణ అందిస్తారు, ఉపాధి కల్పనకు గల అవకాశాల గురించి నిర్వాకులను ఆరా తీశారు.
శిక్షణ సందర్భంగా ఏకాగ్రతతో అన్ని అంశాలను ఆకళింపు చేసుకోవాలని, శిక్షణ పూర్తయిన అనంతరం స్వయం ఉపాధి దిశగా కృషి చేయాలని అభ్యర్థులకు సూచించారు. వినియోగదారులకు సంతృప్తికరంగా నాణ్యమైన సేవలు అందిస్తే శిక్షణ పొందిన రంగంలో చక్కటి ఉపాధి పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట భీంగల్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.