నిజామాబాద్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలకు నెలలు పూర్తిగా నిండకముందే ముందస్తుగా చేసే కాన్పులను సమగ్ర పరిశీలన జరిపేందుకు వీలుగా వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాలలో గల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ తరహాలో జరిగే కాన్పులను సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని అన్నారు.
తల్లి గర్భంలో 40 వారాలు పూర్తయిన పిదప జన్మించే శిశువుల్లో ఎదుగుదల సక్రమంగా ఉండి ఆరోగ్యవంతులుగా పుడతారని పేర్కొన్నారు. అయితే పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వివిధ కారణాలతో ఎంతో ముందుగానే కాన్పులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల నెలలు నిండకముందు జరిగే ప్రసవాల్లో అత్యధికంగా సిజీరియన్లు అవుతుండడమే కాకుండా, పుట్టిన బిడ్డ ఎదుగుదల లోపాలతో అనారోగ్యంగా జన్మిస్తున్నారని అన్నారు.
అధిక రక్తస్రావం వంటి అత్యవసర సందర్భాల్లోనే ముందస్తు కాన్పులు చేయాల్సి ఉండగా, కొన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లలో కాన్పు సమయానికంటే ముందు వచ్చే సూడో పెయిన్స్ ను సాకుగా చేసుకుని నెలలు నిండకముందే సిజీరియన్లు చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయన్నారు. దీనిని నిలువరించేందుకు జిల్లా వైద్యాధికారి సుదర్శన్ నేతృత్వంలో గైనకాలజిస్టు వైద్య నిపుణులు అంజన, ప్రతిమరాజ్, నీలిమలతో సమగ్ర పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో అయినా గర్భిణీకి నెలలు పూర్తిగా నిండకుండా 36 వారాల లోపు ప్రసవం చేయాల్సి ఉంటె, అందుకు గల కారణాలను వాట్స్‌అప్ గ్రూప్ ద్వారా వివరిస్తూ సమాచారం తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కమిటీలోని వైద్యనిపుణులు ఆ కారణాలను సమగ్రంగా పరిశీలించి అవసరం అయితేనే ముందస్తు ప్రసవం చేసేందుకు అనుమతిస్తారని, అలా అనుమతి లేకుండా ముందస్తు కాన్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. అవసరం లేనప్పటికీ సిజీరియన్లు చేసినట్లు తేలితే సంబంధిత ఆసుపత్రులపై చట్టరీత్య చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
కాగా, సాధారణ ప్రసవాల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు, ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో గర్భిణీలకు యోగా, సులభమైన ఎక్సర్సైజ్ లు చేయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఇంటి పనుల విషయంలోనూ యంత్రాల వినియోగం విరివిగా పెరిగిపోవడం వల్ల శారీరక శ్రమ తగినంతగా లేక సహజ కాన్పులకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రసవ సమయానికి చేరువై ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలకు సుఖ ప్రసవం కోసం గైనకాలజిస్టుల పర్యవేక్షణలో సులభమైన ఎక్సర్సైజ్‌లు, యోగాసనాలు వేయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనివల్ల ఎంతో సత్ఫలితాలు వస్తున్నాయని, సాధారణ కాన్పుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు.