నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో క్షయ వ్యాధిగ్రస్థులకు పౌష్టికాహార పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుబ్బ కాలోనికి చెందిన క్షయ వ్యాధి గ్రస్థులకు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ దాతల తోడ్పాటుతో పౌష్టికాహారం కిట్లను సమకూర్చగా, కలెక్టర్ వీటిని పంపిణీ చేసారు.
టీబీ మందులు ఉచితంగా అందిస్తున్న విధంగానే పౌష్టికాహారం సమకూర్చేందుకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. పౌష్టికార లోపం కారణంగా కూడా క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి టీ.బీ రోగులకు చేదోడువాదోడుగా నిలబడాలని కోరారు.
క్షయ రోగులకు ఫుడ్ కిట్స్ అందించేందుకు చొరవ చూపిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కమిటి సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, నరేష్, శ్యామల, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.