నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్ ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత అధికారులకు అందజేశారు. పెండిరగ్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు సమయపాలన పాటిస్తూ, తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో ఆయా అంశాలపై సమీక్ష జరిపారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన ప్రజావాణికి గైరుహాజర్ అయ్యే వారిపై, నిర్ణీత సమయానికి హాజరు కాని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 10.30 గంటలకు ముందే ప్రజావాణికి చేరుకోవాలని సూచించారు.
అదేవిధంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ బయో-మెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తూ వేతనాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అటెండన్స్ / యాక్సెస్ కార్డులను ఇప్పటికే అందించడం జరిగిందని, దాని ఆధారంగానే ఉద్యోగులు విధులకు ఎప్పుడు వస్తున్నారు, ఏ సమయంలో వెళ్తున్నారు అన్నది బయో-మెట్రిక్ ద్వారా నిర్ధారణ చేసుకుని, దాని ప్రకారంగానే వేతనాలు అందిస్తామన్నారు.
మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించేందుకు మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. మన ఊరు – మన బడి కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే శుక్రవారం నాటికి సివిల్ పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు ఉపయుక్తంగా నిలిచేలా కనీసం ఐదు రకాల పనులు చేపట్టాలని ఇదివరకే ప్రతిపాదించామని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ మేరకు పనులు కొనసాగుతున్నాయా, లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఉపాధి హామీ పనులకు ప్రతిరోజు ఎంతమంది కూలీలు హాజరవుతున్నారని వివరాలను సేకరించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 31 వ తేదీ నాటికి అన్ని జీ.పీలలో ఈ పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా జరిపించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించాలని, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు సరిపడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వెంటదివెంట రైస్ మిల్లులకు రవాణా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని, ఏ ఒక్క కేంద్రంలోనూ రైతు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని హితవు పలికారు.
క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే క్రమంలో హరితహారం కింద ఆయా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల నిర్వహణ తీరును గమనించి, స్పష్టమైన నివేదిక అందించాలని ఆదేశించారు. కాగా, ఈ నెల 15 న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం, 18 వ తేదీన దిశా మీటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సూచించారు.
సోమవారం నుండి ప్రారంభమైన టీ.డీ(టెటనస్, డిప్తీరియా) వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా విద్య, వైద్యారోగ్య, సంక్షేమ శాఖల అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, వసతి గృహాలు, సంక్షేమ బడులు, కేంద్రీయ విద్యాలయాలు, మదరసాలు తదితర విద్యా సంస్థల్లో చదువుతున్న ఐదు, పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ జరిగేలా చొరవ చూపాలన్నారు.
ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి : అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
2015 సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు 2015 కు ముందు ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని హితవు పలికారు.
తమ పేరు, చిరునామాను ధృవీకరించే పత్రాలతో సమీపంలో గల ఆధార్ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు కృషి చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపేలా చూడాలని అన్నారు.