కామారెడ్డి, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మొగ్గు చూపే విధంగా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం రాయితీపై ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేస్తుందని తెలిపారు. రాయితీపై బిందు సేద్యం ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. జిల్లాలో 1800 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. రైతు వేదికలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ సాగుపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ లో అంతర్ పంటలు నాలుగేళ్ల వరకు వేసుకోవచ్చునని సూచించారు. ఎకరానికి 50 మొక్కలు నాటాలని కోరారు. చీడపీడల బెడద ఉండదని పేర్కొన్నారు. సమావేశంలో ఎల్డిఎం రమేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, అధికారులు రాజా గౌడ్, ఆదర్శ రైతు భవాని ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.