ప్లాట్ల వేలానికి విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వం నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్ల విక్రయానికి ఈ నెల 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించనున్న బహిరంగ వేలం ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ ఆర్డీవో రవి శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై వేలం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో కౌంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ధాత్రి టౌన్‌ షిప్‌లో మొదటి విడతలో 80 ప్లాట్ల విక్రయాల కోసం 14న ఉదయం 9.00 గంటల నుండి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బహిరంగ వేలం ప్రారంభం అవుతుందని తెలిపారు.

తొలి రోజున ఉదయం వేళలో 20 ప్లాట్లకు, మధ్యాన్నం సమయంలో మరో 20 ప్లాట్లకు వేలం పాట జరుగుతుందన్నారు. మరుసటి రోజు 15వ తేదీన ఇదే తరహాలో మిగతా 40 ప్లాట్లకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తారని వివరించారు. ఆసక్తి కలిగిన ఔత్సాహికులు సకాలంలో హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. వేలంలో పాల్గొనే వారు కలెక్టర్‌, నిజామాబాద్‌ పేరిట 10వేల రూపాయల డీ.డీ, ఆధార్‌ లేదా పాన్‌ కార్డు వెంట తీసుకుని రావాలని సూచించారు.

సెలవు దినాల కారణంగా డీ.డీలు తీయలేకపోయిన వారి సౌకర్యార్థం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు. డీ.డీలు పొందగోరే వారు నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలని సూచించారు. ఇదివరకు రాజీవ్‌ స్వగృహ పథకంలో దరఖాస్తు చేసుకుని డబ్బులు చెల్లించిన వారు ఒరిజినల్‌ రసీదుతో వస్తే వేలం పాటలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

అన్ని అనుమతులు, అధునాతన వసతులతో మోడల్‌ టౌన్షిప్‌ గా రూపుదిద్దుకుంటున్న ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్‌ ల కొనుగోలు కోసం ఔత్సాహికులు ముందుకు వచ్చి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ కోరారు. సమావేశంలో టీఎస్‌ఐఐసి జిల్లా మేనేజర్‌ దినేష్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »