దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణలో విద్యా విస్తరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని ఆపేక్ష చూపుతారని, సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న దళిత జాతి అభ్యున్నతి కోసం అనుక్షణం తపన పడతారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఇందులోభాగంగానే దళిత కుటుంబాలను ప్రణాళికాబద్ధంగా సర్వతోముఖాభివృద్ధి దిశగా పైకి తేవాలని గొప్ప సంకల్పంతో సుదీర్ఘ మేధోమథనం చేసి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఇది ఎంతమాత్రం ఓట్ల కోసమో, రాజకీయ ప్రయోజనాలు ఆశించి తెచ్చిన పథకం కాదని, ఇతర వర్గాల వారిలో అసూయ, ద్వేషాలు చోటుచేసుకుని రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకం అమల్లోకి తెచ్చారని మంత్రి వేముల స్పష్టం చేశారు.

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితరత్న కీ.శే. జె. నారాయణ సంతాప సభను శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల దివంగత దళిత నేత నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను, దళిత జాతి అభ్యున్నతికి అహరహం శ్రమించిన తీరును శ్లాఘిస్తూ, నారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

దళిత సమాజం పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల నిబద్ధత కలిగిన నిఖార్సయిన అంబేడ్కర్‌ వాది నారాయణ సార్‌ అని, అందుకే ఆయనను తన సొంత నియోజకవర్గమైన బాల్కొండలో జూనియర్‌ అంబేడ్కర్‌ అని గౌరవంగా పిలుచుకునే వారమని కొనియాడారు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ, దళితుల ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించేవారని అన్నారు.

తమ ప్రభుత్వం కూడా దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎస్సీల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రతి దళిత కుటుంబానికి వారు ఎంచుకున్న రంగాల్లో వ్యాపారాల స్థాపనకు 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందన్నారు.

ఈ కోవలోనే రాష్ట్రంలోని మొత్తం 119 సెగ్మెంట్‌ లలో ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాల చొప్పున దళిత బంధును వర్తింపజేశామని, ప్రస్తుతం ఒక్కో సెగ్మెంట్లో 1500 దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చానున్నామని వివరించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవని ఘంటాపథంగా చెప్పగలనని మంత్రి అన్నారు. తెలంగాణ తరహాలో విద్యా విస్తరణ కార్యక్రమాలు దేశంలోనే ఏ ఇతర రాష్ట్రాల్లో జరగడం లేదన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత దళిత విద్యార్థుల కోసమే ప్రత్యేకంగా 183 ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాహామని, 90వేల మంది దళిత బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే విధంగా వారికి అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని తెలిపారు. అలాగే 161 ఎస్సీ రెసిడెన్షియల్‌ కాలేజీలు, 33 డిగ్రీ కాలేజీలు, 8 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను, మూడు యూనివర్సిటీలు, పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలను కొత్తగా నెలకొల్పడం వల్ల ప్రభుత్వ విద్యావిధానంలో ఆయా వర్గాల వారికి ఎంతో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో మరో తొమ్మిది వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని మంత్రి వేముల తెలిపారు. ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు 3 వేల మంది దళిత విద్యార్థులకు రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక తోడ్పాటును అందించడం జరిగిందని వివరించారు. దళితుల హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడే విషయంలో తమ ప్రభుత్వం ఎన్నటికీ రాజీ పడబోదని, ఎల్లవేళలా వారికి అండగా ఉంటుందని మంత్రి వేముల స్పష్టం చేశారు.

సంతాప సభలో జుక్కల్‌ శాసన సభ్యులు హన్మంత్‌ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, అంబేడ్కర్‌ సంఘం రాష్ట్ర నాయకులు జె.బి. రాజు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ గంట సదానంద్‌, దళిత సంఘాల ప్రతినిధులు గైని గంగారాం, బంగారు సాయిలు, శ్రీహరి, నిమ్మ నారాయణ, మూల నివాస్‌, నాంపల్లి, హరినాయక్‌, న్యూడెమోక్రసీ నాయకులు వి.ప్రభాకర్‌, దేవరాం తదితరులతో పాటు దివంగత దళిత నాయకుడు నారాయణ కుటుంబ సభ్యులు సుగుణమ్మ, లింగయ్య, రచన, రష్మిత పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »