కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల ధరలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం మూడో విడత దరణి టౌన్‌షిప్‌లో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
తక్కువ ధరకు డిటిసిపి లేఅవుట్ ఉన్న ప్లాట్లు, గృహాలు పొందే వీలుందని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధాన జాతీయ రహదారి 44 సమీపంలో రామారెడ్డి రోడ్ అడ్లూరు శివారులో ధరణి టౌన్షిప్ ఉందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు ఈ.ఎం.డి. రూ.10 వేలు కలెక్టర్ కామారెడ్డి పేరిట డిడి రూపంలో చెల్లించాలన్నారు. వేలం పాటలో ప్లాట్ పొందినవారు నిర్ధారణ లేఖ ఇచ్చిన నాటి నుంచి ఏడు రోజుల లోపు కొనుగోలు చేసిన ప్లాట్ మొత్తంలో మొదటి విడతగా 33 శాతం చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నారు.
కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజులలోపు మొత్తం విలువలో రెండో విడతగా 33 శాతం చెల్లించాలన్నారు. ప్లాట్ మొత్తం విలువలోని మిగతా మొత్తాన్ని ఈఎండి కలుపుకొని నిర్ధారణ లేఖ అందిన నాటి నుంచి 90 రోజుల లోపు మొత్తం చెల్లించవలసి ఉంటుందన్నారు.
ప్లాట్, గృహాల ధర పైన 7.5% రిజిస్ట్రేషన్ చార్జీలు కొనుగోలుదారులే భరించాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి నిర్ధారణ లేఖ అందిన రోజునే ఒకేసారి ప్లాట్ మొత్తం విలువ చెల్లించినచో రెండు శాతం రాయితీ సౌకర్యం ఉంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జోనల్ మేనేజర్ రాందాస్, ఏవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.