ఆర్మూర్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో చేపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. సభకు యూనియన్ ఆర్గనైజర్ నజీర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న హజరై మాట్లాడారు.
మన యూనియన్ ఆవిర్భవించి డిసెంబర్ 10నాటికి 50 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సభ నిర్వహించాలని యూనియన్ నిర్ణయించిందని అన్నారు. ఈ 50 ఏళ్లలో మన యూనియన్ అనేక పోరాటాలు నిర్వహించిందని అనేక విజయాలను సాధించిందని వివరించారు. తొలుత ప్యాకర్ల సమస్యపై పోరాటాలు ప్రారంభమై తదనంతరం బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని కేటగిరీల కార్మికుల సమస్యలు, బీడీలు చుట్టే కార్మికుల ఆకు తంబాకు వేతనాలు తదితర సమస్యలపై పోరాటాలు చేపట్టి డిమాండ్లను సాధించిందని అన్నారు.
బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ కూడా బీడీలు చేస్తున్నారని వారి పని దినాలు తగ్గి అత్యల్ప వేతనాలు పొందుతున్న నేపథ్యంలో వాళ్లకు నెలకు ప్రభుత్వం తరఫున పెన్షన్ ఇవ్వాలని పోరాడి జీవన భృతి సాధించామని ఆ జీవన భృతిని మిగతా కేటగిరీల కార్మికులందరికీ వర్తింపజేయాలని కోరుతూ ఆందోళనలు కూడా సాగిస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో 50 ఏళ్ల స్మృతుల్ని స్మరించుకొని భవిష్యత్ కార్యక్రమాలను మరింత సమరశీలంగా నిర్వహించుకునే వెలుగులో జరిగే స్వర్ణోత్సవ సభ డిసెంబర్ 10న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది బీడీ కార్మికులతో నిర్వహించనున్న నేపథ్యంలో మన గ్రామం నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు నాయకులు మనోజ్, పద్మ, రాజు, గంగామణి తదితరులు పాల్గొన్నారు.