విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన సూచించారు. బుధవారం ఆమె జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి తో కలిసి నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముందుగా ముబారక్‌ నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, ఆయా తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు.

చిన్నారులను పలు ప్రశ్నలు వేస్తూ, వారి బోధనా సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ దేవసేన మాట్లాడుతూ, విద్యార్థులను మూస పద్దతిలో కాకుండా, వారిని ఆకట్టుకునే రీతిలో, సులభంగా అర్ధమయ్యేలా పాఠాలు బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎవరికివారు లెస్సన్‌ ప్లాన్‌ తయారుచేసుకుని, తదనుగుణంగా పిల్లలకు బోధన జరపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు.

అలాంటప్పుడు ప్రైవేటు కంటే ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యా బోధన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరి, పేద కుటుంబాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసినవారవుతారని అన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, చదువులో వెనుకంజలో ఉన్న వారిపై మరింత శ్రద్ధ చూపాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రైవేట్‌ తో పోలిస్తే ప్రభుత్వ బడులలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్ధ్యాలు కలిగి ఉంటారని అన్నారు. తమ శక్తిసామర్త్యాల మేరకు విద్యార్థులను పూర్తిస్థాయిలో పాఠాలు ఆకళింపు చేసుకునేలా తరగతులను బోధించాలన్నారు. ఉపాధ్యాయులు సైతం నిత్య విద్యార్థిలా ప్రతి రోజు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ, పిల్లలను ఆకట్టుకునే విధంగా బోధన చేయాలని హితవు పలికారు.

మెదడుకు పదును పెడుతూ ఉత్సాహంగా విధులు నిర్వర్తించినప్పుడే ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా, విద్యార్థులు భవిష్యత్తుకు చక్కటి దిశా,నిర్దేశం చేసిన వారవుతారని సూచించారు. ఈ సందర్భంగా బోధనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు, బడులలో నెలకొని ఉన్న సమస్యల గురించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

మన ఊరు – మన బడి పనులు పరిశీలన
ఇదిలా ఉండగా, వెంగల్రావునగర్‌లోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులను కమిషనర్‌ దేవసేన పరిశీలించారు. ఈ పాఠశాలలో 450 పైచిలుకు మంది విద్యార్థులు చదువుకుంటుండడం పట్ల హర్షం వెలిబుచ్చారు. పనులు నాణ్యత కలిగి ఉండడాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. టైల్స్‌, ఫ్లోరింగ్‌, కిచెన్‌, టాయిలెట్స్‌, సంప్‌, పెయింట్‌, విద్యుద్దీకరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పాఠశాలల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. పిల్లలను ఆకర్షించే రీతిలో గోడలపై పెయింటింగ్‌ వేయించాలని అన్నారు. ఆమె వెంట పాఠశాల విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ రమేష్‌, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, నర్రా రామారావు, ఇంజనీరింగ్‌ అధికారులు దేవిదాస్‌, ఉదయ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »