నిజామాబాద్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పోడు భూముల పరిశీలన ప్రక్రియలో భాగంగా ఈ నెల 21 వ తేదీ నుండి హాబిటేషన్ల వారీగా గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోడు భూముల అంశంపై ఆర్దీవోలు, ఎఫ్‌డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలం వారీగా పోడు భూముల క్లెయిమ్స్ క్షేత్ర స్థాయిలో పరిశీలన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పలు మండలాల్లో వివిధ కారణాల వల్ల కొన్ని క్లెయిములు పెండిరగ్‌లో ఉన్నాయని అధికారులు తెలుపగా శుక్రవారం సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి క్లెయిమ్‌కు సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 21 నుండి 25 వ తేదీ వరకు హ్యాబిటేషన్ల వారీగా గ్రామ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ సభ గురించి సభ్యులందరికి ముందుగానే సమాచారం తెలియజేయాలన్నారు. కమిటీ సభ్యులతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు, సెక్షన్ ఆఫీసర్లు గ్రామసభల్లో పాల్గొనాలని ఆయన స్పష్టం చేశారు. సభలో ముందుగా తామంతా అటవీ ప్రాంత పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తామని సభ్యులతో తీర్మానం చేయించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం పోడు భూములపై ఇదివరకే దాఖలైన క్లైముల గురించి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన సందర్భంగా వెల్లడైన అంశాలను గ్రామ సభలో చర్చించి తీర్మానాలు చేయాల్సి ఉంటుందన్నారు.
గ్రామసభ సజావుగా, సాఫీగా జరిగేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్, డీ టీడబ్ల్యుఓ నాగోరావు, డీపీఓ డాక్టర్ జయసుధ, మెప్మా పీ.డీ రాములు, ఆర్‌డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎఫ్‌డీఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.