కామారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిలో శనివారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు అధ్యక్షత వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సమగ్ర శిక్ష అభియాన్, ఎఫ్‌ఎల్‌ఎన్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి శ్రీహరి, స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్ శ్రీనాథ్, జిల్లా సెక్టోరియల్ అధికారులు శ్రీపతి, వేణు శర్మ పాల్గొన్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి తెలిపారు.
సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం పాఠశాలలో ఎలా జరుగుతుంది మీ విద్యార్థులు చదువులో ఎలా ఉన్నారని పలు రకాలుగా ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చిన జవాబులతో పాఠశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల అతి తక్కువ సమయంలోనే కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా అభివృద్ధి పరిచి రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎన్నిక కావడం గర్వకారణమని, నిజంగానే పాఠశాల చాలా స్వచ్ఛంగా ఉందని ఎస్‌ఎంసి చైర్మన్ అంకం శ్యామ్ రావుని అభినందిస్తున్నానని రాష్ట్ర విద్యాశాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి తమ బాబును ఈ పాఠశాలలోనే చదివించడం, విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాఠశాలకు కార్పొరేటు స్కూలుకు ధీటుగా 9 గ్రామాల విద్యార్థులు రావడం, గతంలో 12 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతము 200 మంది విద్యార్థులు సంఖ్య పెరగడం అభినందనీయమన్నారు.
ఈ పాఠశాల ఇంకా ఎఫ్‌ఎల్‌ఎన్ విషయంలో కూడా సక్సెస్ కావాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యా కమిటీ చైర్మన్‌కు పలు సూచనలు చేశారు. సమావేశంలో నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించగా, గెలుపొందిన ముగ్గురు విజేతలకు బహుమతి ప్రదానం, సర్టిఫికెట్‌లు అందజేశారు. అంతేకాకుండా చిత్రలేఖన పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థి నైపుణ్యాలు పెంపొందించడానికి పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా సర్టిఫికెట్‌ను ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ మేనేజర్, రేష్మై రాజ్ కుమార్, రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ శ్రీహరి చేతుల మీదుగా అందజేశారు.
కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ శ్రీహరి, రాష్ట్ర రిసోర్స్ మెంబర్ శ్రీనాథ్, జిల్లా సెక్టోరియల్ అధికారులు శ్రీపతి, వేణుగోపాల శర్మ, గ్రామ సర్పంచ్ కొమ్ము యాదగిరి, ఉప సర్పంచ్ చాకలి బాలయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి, విద్య కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు, వార్డ్ మెంబర్లు బికాజీ శ్రీలత, గడ్డమీద అంజలి, విద్యా వాలంటరీలు, మాధురి, భాగ్య, అశ్విని, అమల, పాఠశాల సిబ్బంది సంజువ్, శ్యామల, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.