కామారెడ్డి, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపే గ్రంథాలయాలు భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయని బాల్యదశలోనే గ్రంథాలయాలను వినియోగించుకునే అలవాటును పెంపొందించుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని , మన ప్రాంతంలోని గ్రంథాలయ సదుపాయాలను అవకాశాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు. కామారెడ్డి గ్రంథాలయంలో అనేక సౌకర్యాలతో అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, కామారెడ్డి గ్రంథాలయం మన ప్రాంతంలో విజ్ఞాన సౌరభాలను పంచుతుందని అన్ని సదుపాయాలు కలిగిన ఈ గ్రంథాలయాన్ని యువకులు ఉపయోగించుకోవాలన్నారు.
సభకు అధ్యక్షత వహించిన గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు, యువకులకు అనేక పోటీలను నిర్వహించి వారిని గ్రంథాలయానికి దగ్గరగా చేశామని పుస్తకాలను చదివి యువకులు తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలన్నారు. విద్యార్థి దశలోనే గ్రంథాలయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అన్నారు.
గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలు పొందిన విద్యార్థులు ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇంకా చాలామంది మంచి ఫలితాలను పొందాలని దీని కోసం అందరం కృషి చేస్తామన్నారు. వారోత్సవాల ప్రారంభం నుండి ముగింపు వరకు విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాలైన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పట్టణంలోని అన్ని విద్యాలయాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలు పొందిన యువకులకు పట్టణంలోని సీనియర్ వైద్యులను, ఆదర్శ రైతులను, సీనియర్ సిటిజన్స్, యోగ అభ్యాసకులను, లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ప్రతినిధులను, కవులు, కళాకారులను సత్కరించారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, కామారెడ్డి సహకార పరపతి సంఘం చైర్మన్, వైస్ చైర్మన్లు పాత లక్ష్మణ్, శంకర్ గౌడ్, పుస్తకాల ధాత కొత్తింటి శ్రీనివాస్ కవి రచయిత గఫూర్ శిక్షక్, దేవాగౌడ్, నాగభూషణం, సాయన్న, రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్ ప్రతినిధులు కవి సిరిగాధ శంకర్, నాగభూషణం, జైహింద్ గౌడు, పురుషోత్తం రఘు కుమార్, గ్రంథాలయ సిబ్బంది, దాతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.