నిజామాబాద్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డ్రోన్ ద్వారా ఔషధాలను సరఫరా చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికార్ట్, టీ.శా అనే స్టార్టప్ కంపెనీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుండగా, కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు.
డ్రోన్ ద్వారా ఔషధాలను అవసరమైన ప్రాంతాలకు చేరవేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జిల్లా పాలనాధికారి సమక్షంలో డ్రోన్ ద్వారా ఎడపల్లిలోని ఓ ఆసుపత్రికి ఔషధాలను విజయవంతంగా చేరవేయగలిగారు. ఈ సందర్భంగా డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా సేవలను అందుబాటులోకి తెచ్చిన వంశీకృష్ణ, మధుసూదన్ లను కలెక్టర్ అభినందించారు. యువత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజానికి, వివిధ వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా నిలిచేలా సేవలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో డ్రోన్ ద్వారా అతితక్కువ సమయంలో ఔషధాలను నిర్దేశించిన ప్రాంతానికి సరఫరా చేయగల్గుతున్నామని వంశీకృష్ణ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. డ్రోన్లు ఆకాశంలో 200 మీటర్ల ఎత్తులో ఎగరగల్గుతాయని, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 20 కిలోల బరువు వరకు ఔషధాలను సరఫరా చేయవచ్చని వివరించారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికార్ట్, టీ.శా కంపెనీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.