ఆర్మూర్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల ఎల్ఓసీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్ రమేష్ రెడ్డి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని అతడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే ఆయన సీఎంఆర్ఎఫ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి రెండు లక్షల రూపాయల ఎల్వోసీని మంజూరు చేయించారు.
జీవన్ రెడ్డి బుధవారం ఎల్వోసీ చెక్కును అందజేశారు. రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎల్వోసీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.