నిజామాబాద్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో పోడు సాగును అడ్డుకునే క్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యకు గురైన సంఘటనను కలెక్టర్ ఉటంకిస్తూ, ఈ తరహా ఉదంతాలకు తావులేకుండా ముందస్తుగానే పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా అటవీ సంబంధిత అంశాలపై మౌఖికంగా కానీ, రాతపూర్వకంగా కానీ ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో టీమ్ వర్కుగా పని చేయాలని హితవు పలికారు. అటవీ భూముల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో సీరియస్ గా ఉందన్నారు.
ఎక్కడ కూడా అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ భూముల పరిరక్షణ విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని, ఈ విషయంలో జోక్యం చేసుకునే వారు ఎంతటివారైనా లిపీ.డీ యాక్టులి ను నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. పోడు భూముల అంశం అతి సున్నితమైనందున ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ అర్హులైన వారికి పోడు పట్టాలు అందించి, హద్దులు చూపించేంత వరకు ఎవరు కూడా అటవీ భూములను ఆధీనంలోకి తీసుకోకుండా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారులు, సిబ్బందికి జిల్లా యంత్రాంగం పూర్తి భద్రత కల్పిస్తుందని భరోసా అందించారు. ఈ దిశగా పోలీసు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని, దాడుల ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఆయా వర్గాల వారి కదలికలను పసిగడుతూ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సెల్ కాన్ఫరెన్స్‌లో పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, డీఎఫ్‌ఓ వికాస్ మీనా, ఆర్డీఓలు, ఎఫ్డీఓలు, రేంజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.