కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 15 నాటికి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు పడక గదుల గృహ నిర్మాణం పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సమీక్షించారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, 18 వేల 328 కోట్ల వ్యయంతో 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి, పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా వంద శాతం సబ్సిడీతో పంపీణి చేసేలా సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రుపోందించారని మంత్రి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్లు నిర్మాణం తుది దశలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి 26 వేల ఇండ్లను అందజేసామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు 69 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిన గ్రామం, పట్టణ పరిధిలో అధిక సంఖ్యలో అర్హులైన లబ్దిదారులకు ఉన్న నేపథ్యంలో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్హులు వివరాలతో వెయిటింగ్ లిస్టు జాబితా తయారు చేయాలని మంత్రి సూచించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పూర్తయిన ఇండ్ల పంపిణీ క్షేత్రస్థాయిలో సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీలో 18 వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంబంధించిన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పంపిణీ చేయాలని కలెక్టర్‌లకు మంత్రి సూచించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్ వంటి మౌళిక వసతుల కల్పనకు రూ. 205 కోట్లు మంజూరు చేశామని, నిధులను వినియోగించుకుంటూ మౌళిక వసతుల కల్పన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. 18 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 11,990 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని, నిధులకు ఎలాంటి కోరత లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తుది దశ నిర్మాణంలో ఉన్న 40 వేల రెండు పడక గధుల ఇండ్లు వేగవంతంగా పూర్తి జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వేగం పెంచాలని, ప్రతి మాసం పురోగతి పై రివ్యూ నిర్వహిస్తామని, జనవరి 15 నాటికి సంపూర్ణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల పై జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని సీఎస్ సూచించారు.
జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని తేదీ నిర్ణయించుకొని పంపిణి చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లాకు 10,317 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 7,890 పట్టణ ప్రాంతాలలో 2,331 ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలలో 3714 , పట్టణ ప్రాంతాల్లో 1850 ఇండ్ల నిర్మాణం పూర్తయినట్లు పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్డివో సాయన్న, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జెడ్పి సీఈవో సాయగౌడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్‌డివోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, రాజా గౌడ్ పాల్గొన్నారు.