ఎమ్మెల్యే చొరవతో ఐక్యతా రాగం

ఆర్మూర్‌, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ క్షత్రియ సమాజ్‌ (పట్కరి) ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రతిష్టంభన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి చొరవతో తొలగిపోయింది. క్షత్రియ సమాజ్‌లోని రెండు వర్గాలు వైరుధ్యాలను పక్కనపెట్టి ఇక ముందు కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఐక్యతారాగం ఆలపించాయి. వివరాల్లోకి వెళ్ళితే… ఆర్మూర్‌ పట్టణ క్షత్రియ సమాజ్‌కు జరిగిన ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన రెడ్డి ప్రకాష్‌, మదన్‌ మోహన్‌కు చెరి సమానంగా ఓట్లు రాగా సెక్రటరీగా గంగామోహన్‌ ఎన్నికయ్యారు.

అధ్యక్ష పదవికి పోటీపడిన మదన్‌ మోహన్‌కు 595 ఓట్లు రాగా రెడ్డి ప్రకాష్‌కు కూడా ఒక టెండర్‌ ఓటుతో కలిపి 595 ఓట్లు వచ్చాయి. దీంతో రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడి విషయం పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వద్దకు చేరింది. ఆయన గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆర్మూర్‌ పట్టణ క్షత్రియ సమాజ్‌లోని రెండు వర్గాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.

నిర్ణయం ఏదైనా రెండు వర్గాలు ఐక్యమై కలిసికట్టుగా ముందుకు సాగాలని గట్టిగా చెప్పారు. మూడేళ్ళ పదవీకాలం లో మొదటి ఏడాదిన్నర ఒకరు, చివరి ఏడాదిన్నర మరొకరు అధ్యక్ష పదవిలో కొనసాగాలని జీవన్‌ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి రెండు వర్గాల వారు అంగీకారం తెలపడంతో మొదటి ఏడాదిన్నర ఎవరు అధ్యక్ష పదవిని స్వీకరించాలన్న దానిపై రాత్రంతా తర్జనభర్జనలు జరిగాయి.

ఈ సమయంలో రెడ్డి ప్రకాష్‌ తనకు మొదటి ఏడాదిన్నర అధ్యక్ష పదవి నిర్వహించే అవకాశం కలిపిస్తే నవనాధ సిద్ధులగుట్టపై క్షత్రియుల ఆరాధ్యదైవమైన ‘‘జై సహసార్జున’’ దేవుడికి రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఆలయం నిర్మిస్తానని ప్రతిపాదించారు. దీనికి క్షత్రియ సోదరులంతా ఒప్పుకుంటే రేపే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాదిలోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని చెప్పారు.

ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చొరవతో ఈ ప్రతిపాదనకు అంగీకరించిన క్షత్రియ సమాజ్‌ ప్రతినిధులంతా ఐక్యమై రెడ్డి ప్రకాష్‌ మొదటి ఏడాదిన్నర అధ్యక్ష పదవిలో కొనసాగాలని తీర్మానించారు. సమస్యను కొలిక్కి తెచ్చి క్షత్రియ సమాజ్‌ ప్రతినిధులను ఐక్యం చేసిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. క్షత్రియ సమాజ్‌ ప్రతినిధులు జీవన్‌ రెడ్డిని శాలువాలు,పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఆర్మూర్‌ పట్టణ క్షత్రియ సమాజ్‌ సోదరులు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రతినిధులను ఆయన అభినందించారు. సమాజ్‌ నూతన కమిటీకి జీవన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »