నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా గట్టిగా కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఓటరు నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు నూటికి నూరు శాతం ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకే పరిమితం కాకుండా బూత్ లెవెల్ అధికారులు తమతమ బూత్ ల పరిధిలో ఇంటింటికి తిరుగుతూ అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని, చక్కటి టీం వర్క్ తో ప్రణాళికాబద్ధంగా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. అదే సమయంలో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై కూడా దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితాకు అనుగుణంగా ఆధార్ సీడిరగ్ పూర్తి కావాలన్నారు.
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు, మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు సంబంధిత ఫారం 7, ఫారం 8 లను సేకరించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు ప్రాముఖ్యత గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వంద సంవత్సరాలకు పైబడి వయస్సు కలిగిన ఓటర్ల ఫొటోలతో, వారు క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకున్న తీరును వివరిస్తూ అన్ని గ్రామాల్లో కొత్త ఓటర్లకు ప్రేరణ కలిగించేలా ఫ్లెక్సీలు ప్రదర్శించాలని ఆదేశించారు.
సెల్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీసీఓ సింహాచలం, డీపీఓ జయసుధ, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, ఈ ఆర్ ఓలు, సహాయ ఈఆర్‌ఓలు, బీ.ఎల్.ఓ లు తదితరులు పాల్గొన్నారు.