పంట రుణాల పంపిణీలో ఉదాసీనత వీడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకీ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.

గత ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి బ్యాంకుల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోవడం పట్ల కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. పదేపదే చెబుతున్నప్పటికీ పంట రుణాల పంపిణీలో పలు బ్యాంకులు ఉదాసీన వైఖరిని వీడడం లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లా యంత్రాంగం తరపున కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

గతేడాది ఖరీఫ్‌ సీజన్లో పంట రుణాల పంపిణీలో 79 శాతం లక్ష్యం సాధించగా, ఈసారి మరింతగా పెరగాల్సింది పోయి 72 శాతానికి పడిపోవడం ఏమిటని ఆయా బ్యాంకుల అధికారులను ప్రశ్నించారు. 2308 కోట్ల రూపాయలను పంపిణీ చేయాలని లక్ష్యం కాగా, 1664 . 45 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే పంపిణీ చేశారని అన్నారు. బ్యాంకర్ల తీరును పరిశీలిస్తే, క్రమక్రమంగా రైతులకు దూరం అవుతున్న పరిస్థితి నెలకొంటోందని, ఇది ఎంతమాత్రం మంచి పధ్ధతి కాదన్నారు. జిల్లాకు సేద్యపు రంగమే వెన్నుముకగా ఉన్నందున, ప్రతి రైతుకు సేవలను విస్తరింపజేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు.

తదుపరి సమావేశం నాటికి పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, జిల్లాలో ఆదర్శ రైతులు ఉన్నందున లక్ష్యానికి మించి పంట రుణాలు అందించేందుకు చొరవ చూపాలన్నారు. రుణాల రికవరీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు.

కాగా, స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిన రుణాలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని మెప్మా అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే, వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలు ఇప్పించేందుకు కూడా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పట్ల కలెక్టర్‌ అభినందిస్తూ, శిక్షణ పూర్తి చేసుకుని, అర్హత కలిగి ఉన్న వారికి యూనిట్ల స్థాపన కోసం మరింత పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు.

సమావేశంలో ఆర్‌.బి.ఐ ప్రతినిధి వైభవ్‌ వ్యాస్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »