కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరంగల్‌లో రాహుల్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలోని నరసన్నపల్లి, పాతరాజంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడారు.
రైతు డిక్లరేషన్‌పై గ్రామస్తులతో ముఖాముఖి అయ్యారు. ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15వేల రూపాయల సాయం, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంటలకు బీమా, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక చక్కరు కర్మాగారాలు తెరిపించడం లాంటి అంశాలపై రైతులతో చర్చించారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడిస్తాం, దొర గడిని బద్దలు కొడతాం, టీఆర్‌ఎస్ పార్టీకి రెండు సార్లు అధికారం కట్టబెడితే కేంద్రంపై నెపం మోపడం ఢల్లీి వెళ్లి పోరాడతానని కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. వీరి హయాంలో పెట్రోలు, డీజిలు ధరలు విపరీతంగా పెరిగాయని దుయ్యబట్టారు.
మోదీ గొప్పగా చెప్పుకునే నోట్ల రద్దు పేదల పాలిట విషప్రయోగమని మండిపడ్డారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ అమ్ముకుంటున్నారని విమర్శించారు. మోదీ హయాంలో దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అంబానీ, అదానీ రెడీగా ఉన్నారన్నారు. అదే విధంగా కేసీఆర్ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను తన బంధువులకు కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు.
వీరి వల్ల దేశం, రాష్ట్రం పెను ప్రమాదంలో పడ్డాయని, వీటిని రక్షించుకోవాలని చెప్పారు. మోదీ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సముచిత న్యాయం చేస్తామన్నారు.