కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు.
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు,బాధ్యతలు కూడా పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిపాలన అధికారి రవీందర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, జిల్లా అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.