ఆర్మూర్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలనలో నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డా సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేయడం మంచి పరిణామమన్నారు.
రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేయడం రాష్ట్ర వైద్య శాఖ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఇందువల్ల నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు కలిగిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండు నుంచి మూడు వేల రూపాయల ఖర్చయ్యే ఈ రకమైన స్కానింగ్ ఇక మీదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయడానికి వీలు కలిగిందని జీవన్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం కలిపించి నాణ్యమైన వైద్య సేవలను ప్రారంభించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను అడిగిందే తడవుగా ఆర్మూర్‌ను వంద పడకల ఆసుపత్రిగా అఫ్ గ్రేడ్ చేసి యుద్ధప్రాతిపదికన నిధులు కేటాయించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు ప్రారంభించడం వల్ల ఇప్పటికే 20వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందజేసిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
ఒక్క ఆర్మూర్ నియోజక వర్గంలోనే 25వేల మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్ధిక సాయం అందించి వారి ప్రాణాలు కాపాడిన సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది అని జీవన్ రెడ్డి అభివర్ణించారు.