కేసీఆర్‌ పాలనలో చారిత్రాత్మక ప్రగతి

బాల్కొండ, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

జలాల్పూర్‌ నుండి నాగపూర్‌ ఎక్స్‌ రోడ్‌ వరకు రూ. 60 లక్షలతో బీ.టి రోడ్‌ పునరుద్ధరణ పనులకు, నూతనంగా మంజూరైన ఎస్‌.సి కమ్యూనిటీ హాల్స్‌ అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా, భీంగల్‌ – గోన్‌ గొప్పుల రహదారి బోగరపు వాగుపై రూ. 2.60 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించారు.

భీంగల్‌ – బెజ్జోరా రహదారి జక్కలత్‌ ఒర్రెపై రూ. 2.35 కోట్లతో నూతనంగా నిర్మించనున్న హైలెవల్‌ బ్రిడ్జ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. భీంగల్‌ – కమ్మర్పల్లి రహదారి పై మెండోరా వద్ద రూ. 1.66 కోట్లతో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ప్రతీచోట ప్రజలు డప్పు వాయిద్యాలు, బోనాలు, మంగళహారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, పల్లెల ప్రగతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగిస్తోందని తెలిపారు. ఇంకనూ చేపట్టాల్సిన పనులు మిగిలి ఉన్నందున వాటి నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి ప్రతి గ్రామంలో నిరంతరంగా అభివృద్ధి పనులు జరిపిస్తున్నామని అన్నారు. వానాకాలంలో కురిసిన ఏకధాటి వర్షాల వల్ల లోలెవల్‌ కాజ్‌ వేలు దెబ్బతిని రవాణా పరంగా ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీంతో భీంగల్‌ మండలానికి మూడు హై లెవెల్‌ బ్రిడ్జిలు మంజూరు చేశారని తెలిపారు.

వీటిలో ఇప్పటికే గోన్‌ గొప్పుల, మెండోరా వద్ద రెండు వంతెనలు పూర్తయ్యాయని, బెజ్జోరా వద్ద 2.35 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే మూడు మాసాల్లో పనులు పూర్తి చేయిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, ప్రభుత్వ అభివృద్ధిపై ఆలోచనలు చేయాలని కోరారు. అభివృద్ధికి సరిసమానంగా సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో 200 రూపాయలకే పరిమితమైన ఆసరా పెన్షన్లను రెండు వేల రూపాయలకు పెంచామని, దివ్యంగులకు మూడు వేల పెన్షన్‌ ను నెలనెలా అందిస్తున్నామని గుర్తు చేశారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక తోడ్పాటును సమకూరుస్తున్నామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో గ్రామగ్రామాన ఆయా కులాల వారికి సంఘ భవనాలు నిర్మింపజేస్తున్నామని మంత్రి తెలిపారు. అనుకోని రీతిలో ఆపదలు, అనారోగ్యాల బారిన పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విరివిగా ఆర్థిక సహాయం ఇప్పిస్తున్నామని అన్నారు.

ప్రజల అవసరాలను గుర్తిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో ఆర్మూర్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, జెడ్పి కోఆప్షన్‌ సభ్యుడు మొయీజ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »