గడువులోపు నిర్మాణాలు పూర్తి కావాల్సిందే

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జనవరి 10 వ తేదీ నాటికే డబుల్‌ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీకి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, డ్రైనేజీ, అప్రోచ్‌ రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్డీఓల నేతృత్వంలో ఆయా మండలాల తహసీల్దార్లు తమతమ నియోజకవర్గ శాసన సభ్యులను సంప్రదించి వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా సోమవారం నుండి గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తుల సమగ్ర వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు.

మూడు రోజుల పాటు కార్యదర్శులచే దరఖాస్తులు స్వీకరించి, వాటిని తమకు పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. దరఖాస్తులను తాము ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని, అక్కడి నుండి ఆమోదం లభించిన మీదట ఇళ్ల సంఖ్య కంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 3031 డబుల్‌ బెడ్‌ రూంలు పూర్తయ్యాయని, తుది దశలో ఉన్న మిగతా 3849 ఇళ్ల నిర్మాణాలను సైతం జనవరి 10 వ తేదీ లోపే పూర్తి చేయాలని సూచించారు.

ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని, నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సమకూర్చుకునేందుకు తోడ్పాటును అందించాలని తహసీల్దార్లకు సూచించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ల పంపిణీ కోసం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు దాటకుండా పనులు పూర్తయ్యేలా ప్రతి రోజు పర్యవేక్షణ జరపాలన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసిఓ సింహాచలం, ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »