నిజామాబాద్, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత లభించేలా చొరవ చూపాలని జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పించారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో ఎంతమంది దివ్యాంగులకు అవకాశం లభించింది తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా దివ్యాంగులకు వారి కోటాను అనుసరిస్తూ ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాల్లో నూటికి నూరు శాతం అవకాశం దక్కేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. దీనిని ఏదో సానుభూతిగా పరిగణించకూడదని, ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు కల్పించబడిన హక్కుగా గుర్తించి పక్కాగా ఈ నిబంధనలు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో పాటు అర్హులైన దివ్యాంగులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇతర అన్ని పథకాలలోనూ దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ వారికి లబ్ది చేకూరేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వివిధ శాఖల ఉద్యోగ ఖాళీల భర్తీల్లోనూ దివ్యాంగులకు నిబంధనల మేరకు నియామకాల్లో అవకాశం కల్పించాలన్నారు.
అదేవిధంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన దివ్యాంగులందరికి తప్పనిసరిగా ఓటరు జాబితాలో చేర్చి, ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయించాలని ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.