ఎడపల్లి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశులను అక్రమ రవాణా చేస్తున్న ఓ టాటా ట్రక్‌ని ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. మత్తు ముందు ఇచ్చి టాటా ట్రక్కులో కుక్కి తరలిస్తున్న 48 పశువులను ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారు వద్ద పక్కా సమాచారం మేరకు ఎడపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి బోధన్ లోని గోశాలకు తరలించారు.
సిజి 04 ఎన్ ఎక్స్ 4779 నెంబరు గల టాటా ట్రక్ వాహనంలో కొందరు వ్యక్తులు ఆవులను తరలిస్తున్నట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు సమాచారం అందిందని ఎడపల్లి ఎస్సై పాండే రావు తెలిపారు. వెంటనే కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్న ప్రదేశానికి ఎస్సై పాండే రావు, పోలీస్ సిబ్బందితో చేరుకున్నారు. ట్రక్‌ను నిలిపి ట్రక్ వెనకాల డోర్ తీసి చూడగా ఎల్లిగడ్డల సంచుల మాటున ట్రక్ వాహనంలో సరైన ఆహారం, నీరు, శ్వాస తీసుకోవడానికి స్ధలం లేకుండా, క్రూరమైన రీతిలో పశువులను కట్టివేశారు.
నాగ్‌పూర్ నుండి లాతూర్‌లోని కబేళాలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పశువులను ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు తెలిపిన పోలీసులు నాటకీయ పరిణామంలో సాటాపూర్ గేటు వద్ద వడ్డేపల్లి రోడ్డులోని ఓ రైస్ మిల్ వద్దకు ట్రక్‌ను తీసుకెళ్లారు. మీడియా కూడా ఫాలో చేయడంతో ఇక చేసేదేమీ లేక పశువులతో నిండిన ట్రక్‌ను ఎట్టకేళకు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సమాచారం అందు కొన్న బీజేపీ, వీహెచ్పి, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలి రావడంతో పోలీసులు గేట్లు మూసివేసి బీజేపీ, భజరంగ్ కార్యకర్తలు, మీడియాని లోనికి రాకుండా అడ్డుకొన్నారు. దీంతో వారు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ గోవుల అక్రమ రవాణా కొనసాగుతుందని ఆరోపించారు. పోలీసుల తీరుపై హిందూ కార్యకర్తలు తీవ్రంగా విమర్శించారు. దీంతో మీడియాను, కొందరు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లోకి అనుమతించారు.
అయితే ట్రక్‌లో ఉన్న పశువులను కింద దింపేందుకు ప్రయత్నించగా మత్తులో ఉన్న పశువులకు వెటర్నరీ సిబ్బంది వైద్య చికిత్సలు అందజేశారు. అయినా మత్తు వదలక పోవడంతో పశువులను బోధన్ పట్టణంలోని గోశాలకు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా అవుతున్న ట్రక్‌లో మొత్తం 48 పశువులున్నట్లు గమనించిన అక్కడున్న వారు నిర్ఘాంతపోయారు. ఘటనా సమాచారం అందుకొన్న బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్ రాజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు.