ఆర్మూర్, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆం ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మార్చాలన్న బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యసర్వే నిర్వహించడం ద్వారా రక్తపోటు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించారు.
వారికి వెంటనే షుగర్, బీపీ మందులను పంపిణీ చేయాలని, మందులు క్రమం తప్పకుండా ఎలా వాడాలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యవేక్షణలో భాగంగా హెల్త్ కిట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గంలోని చేపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ’’ సాధన సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం 15 వేల మందిని గురించి వారికి ఇంటింటికీ వెళ్లి షుగర్, బీపీ మందుల కిట్లు పంపిణీ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమాయత్త మయ్యారని ఆయన తెలిపారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు వైద్య శాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశంసించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు. వంద పడకలకు అప్ గ్రేడ్ అయిన ఆర్మూర్ ఆసుపత్రిలో ఇప్పటికే 22,670 ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు20వేల మందికి వైద్య చికిత్స ల కోసం సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను, మరో వెయ్యి మందికి ఎల్ వో సీలు అందించామన్నారు.
మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎక్కడా లేవన్నారు. ప్రజలంతా తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జీవన్ రెడ్డి కోరారు.
కార్యక్రమంలోఆర్మూర్ డిఫ్యూటీ డీఎంఅండ్హెచ్వోతో పాటు వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎమ్లు, ఇతర వైద్య సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బీపీ పరీక్షలు నిర్వహించి నార్మల్గా ఉందని నిర్థారించారు.