కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విక్రమ్ వైద్యశాలలో జులేఖ బేగం (75) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఏబి నేగిటివ్ రక్తం దొరకకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ సంతోష్ మానవత దృక్పథంతో స్పందించి 10 వ సారి రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సురేఖ (28) గర్భిణీ స్త్రీ అనిమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన ఏ నెగిటివ్ రక్తాన్ని శనివారం వీ.టి ఠాకూర్ రక్త నిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, గంప ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఓ, ఏ, బి, ఏబి నెగిటివ్ రక్తదాతలు కామారెడ్డి జిల్లాలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లవేళలా నెగిటివ్ గ్రూపుల రక్తాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా 2007 నుండి అత్యవసరలో పరిస్థితుల్లో ఉన్న వేలాదిమందికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.
దీనికి ప్రధాన కారణం కామారెడ్డి జిల్లా రక్తదాతలు మానవతా దృక్పథంతో స్పందించడం వల్లనే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నామన్నారు. శనివారం రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత సంతోష్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టీ ఠాకూర్ రక్తనిధి కేంద్ర టెక్నీషియన్లు చందన్, ఏసు గౌడ్ పాల్గొన్నారు.